పార్వతీ కళ్యాణము – 8
కళ్యాణం కోసమని శివుడు పీటల మీదకు వచ్చి కూర్చుంటున్నాడు. అది గొప్ప చారిత్రాత్మకమయిన కళ్యాణము. శివుడు పీటల మీదికి వస్తుంటే మేఘముల లోంచి వృష్టి పడిపోయిందా అన్నట్లుగా పువ్వులు జల్లేశారు. అయ్యవారు పెద్దపుష్ప వృష్టితో పెద్ద మేళతాళముల ధ్వనులతో గణాధిపులు అందరూ నిలబడి ఎక్కడ చూసినా జయజయశంకర హరహర శంకర అని జయజయ ధ్వానాలు చేస్తుంటే పీటల మీదికి వచ్చి కూర్చున్నాడు. పార్వతీదేవి గౌరీతపస్సు చేసింది. ఆవిడే ఆవిడ గురించి తపస్సు. ఎందరో ధన్యులు అయినవారు, దిక్పాలకులు, ఇంతమంది మధ్యలో నిలబడి కొలుస్తుండగా ఒకపక్కన సరస్వతీదేవి, మరొక పక్కన లక్ష్మీదేవి, అరుంధతి శచీదేవి వీళ్ళందరూ వెంట వస్తుంటే అమ్మవారు పెళ్ళి పీటల మీదికి బయలుదేరి వస్తోంది.
ఎన్నడూ అలా వెళ్ళవలసిన అవసరం లేని శంకరుడు పార్వతీదేవి అడిగిందని కన్యాదాత గారింటికి తానే వచ్చాడు. హిమవంతుడి ఇంటికి వచ్చి లోపల పొంగిపోతూ సంతోషంగా ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు పూర్ణ చంద్రుడు అవుతుంటే కళలు పెరుగుతుంటే సముద్రంలో పోతూ పెరుగుతుంది. పెళ్ళి పీటల మీదకి స్వామివస్తుంటే పౌర్ణమి చంద్రుని చూసిన సముద్రం పొంగిపోయినట్లు జనం అందరూ ఆ దేవసార్వభౌముడిని జగదంబతో పీటల మీద చూస్తున్నాము మా కలలు పండిపోయాయి. మాకు కన్ను ఉన్నందుకు ఇన్ని కోట్ల జన్మల తరువాత మా నేత్రములు సార్ధకత చెందాయి’ అని పరవశించి పోతున్నారు.
హిమవంతుడు శంకరుడిని తీసుకువచ్చి చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి మహానుభావుడు శంకరుడు నాకు అల్లుడు అవడానికి తనకు పిల్లనివ్వమని కబురు చేయడం మాని తానే వచ్చాడని పొంగిపోయి వినయ విధేయతలతో ఆ పెళ్ళికొడుకు కాళ్ళు కడిగాడు. పార్వతీ పరమేశ్వరులకు మధ్యలో తెర కట్టారు. తెరకు అటువైపు శంకరుడు, ఇటువైపు పార్వతీదేవి కూర్చున్నారు. పార్వతీ పరమేశ్వరులవి శరీరములు రెండు, మనస్సు మాత్రం ఒక్కటే. ఇద్దరి మనస్సులో ఒక్కటే కోరిక ఉన్నది. ఇది లోకంలో ఏ దంపతుల మధ్యనయినా ఉండేదే. మధ్యలో ఈ తెరను ఎప్పుడు తీసేస్తారా అని అనుకుంటున్నారు. అనగా ఇద్దరి మనస్సులలోను ఒకటే కోర్కె దంపతులకు అలా ఉండాలి.
హిమవంతుడు కన్యాదానం చేయడం కోసమని చెప్పి మేనకాదేవి కలశంతో నీళ్ళు పట్టుకొనగా శంకరుని పాదములు కడగడం కోసమని సిద్ధపడ్డాడు. బ్రహ్మగారు యాజ్ఞీకం చేస్తున్నారు. ఆయన అన్నారు ‘పిల్లవాడి ప్రవర చెప్పాలి కదా ఎవరికి తెలుసండి’ అని అడిగారు. అక్కడ ఉన్నవారిలో ఒక పెద్దాయన ‘నీవు చతుర్ముఖ బ్రహ్మవి – బ్రహ్మ స్థానంలో ఉన్నవాడివి. అటువంటి వాడివి నీకే తెలియక పోతే ఎవరికి తెలుస్తుంది? పోనీ లక్ష్మీ నారాయణులను అడగండి అన్నారు. నారాయణుడు నేను ఆయన వామభాగంలోంచి పుట్టాను నాకన్నా ముందు ఉన్నాడు ఆయన. నాకు ఆయన సంగతి తెలియదు అన్నాడు. మరి ఎవరిని అడిగితే తెలుస్తుందా అని పరికిస్తే అక్కడ పొంగిపోతూ వీణ వాయిస్తున్న నారదుడు కనిపించాడు. నారదుని అడుగగా మహాత్ముడికి ప్రవర ఏమిటి? నిర్గుణ నిష్కలంక నిరంజన అని ప్రవర చెప్పేయండి అంతే అని చెప్పేసరికి సభలో ఉన్నవారు పొంగిపోయి శంకరుడికి ప్రవర అలా చెప్పండని అన్నారు.
అలా ప్రవర చెప్పి హిమవంతుడు, మేనకాదేవి పార్వతీ దేవిని కన్యాదానం చేస్తున్నారు. తెరతీసి శుభముహూర్తంలో జీలకర్ర, బెల్లం పెట్టిస్తున్నారు. తెర పైకెత్తినపుడు కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి. తెర తీసివేయగానే ఆవిడ ఆయనను, ఆయన ఆవిడ చూసుకుంటారు. ఆ శుభ ముహూర్తంలో కళ్ళు కళ్ళు కలుసుకుంటే జీవితాంతం మనస్సులు ఏకీకృతం అవుతాయి. ఇద్దరి మధ్య అనురాగం అంకురిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. వారు లోకమునకు పాఠం చెప్తున్నారు.
తలంబ్రాలు పోసుకోమన్నారు. కోరికలు పోస్తున్నదా అన్నట్లు అమ్మవారు తలంబ్రాలను పోస్తోంది. అన్నీ తీరుతాయి అన్నట్లుగా పున్నమి చంద్రుడి వంటి ముఖము ఉన్న పార్వతీదేవి తలమీద తలంబ్రాలను శంకరుడు పోశాడు. అలా ఇద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్న ఘట్టం చూసి లోకం అంతా పొంగిపోయింది. తరువాత పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణమునకు శక్తిమంతమయిన మంత్రం చెప్తారు. తరువాత విడిది గృహప్రవేశం చేయించాలి. వారిని బయటకు తీసుకు వచ్చి పీఠంమీద విడిది గృహప్రవేశం చేయించారు. తదుపరి లాజహోమంతో కార్యక్రమం పూర్తిచేస్తారు. దేవతలందరూ వచ్చి ‘అయ్యా! పూర్వం మీరు రతీదేవికి అభయం ఇచ్చారు. దయచేసి మన్మథుని బ్రతికించండి’ అని అడిగితే శంకరుడు పార్వతివంక సంతోషంగా చూశాడు. అంతే మరల మన్మథుడు పుట్టాడు. మళ్ళీ జగత్ సృష్టి ప్రారంభం అయింది.
హిమవంతుడు పొంగిపోయి పార్వతీదేవిని దగ్గరకు పిలిచి ‘అమ్మా! ఎంత అదృష్టం నీకు తండ్రిని అయ్యాను. నువ్వు ఈవేళ ఒక ఇల్లాలివి అయ్యావు. నిన్ను అత్తవారింటికి పంపిస్తున్నానని తలమీద నెమ్మదిగా జుట్టంతా రాస్తూ పదిమంది చూస్తుండగా కన్నుల నీరు కార్చేశాడు. అప్పగింతలు పెడుతూ పార్వతీదేవికి సుద్దులు చెప్తున్నారు. పార్వతీదేవి వద్దకు చెలికత్తెలందరూ వచ్చారు. అమ్మా! నీకు సారె పెడతాము. అల్లుడు గారికి కూడా సారె పెట్టాలని ఉంది. కానీ అల్లుడు గారికి సారె పెడదామంటే మా దగ్గర అనగా ఇంత ఐశ్వర్యవంతమయిన హిమవత్పర్వతం దగ్గరే కాదు శంకరుడికి ఇవ్వగలిగిన వస్తువులు ఎవరి ఇంట్లోనూ ఉండవు అన్నారు. చెలికత్తెలు పరిహాసం ఆడినట్లూ ఉన్నది. శంకరుడికి ఇవ్వలేనితనమును చెప్తున్నారు. హిమవంతుడు తన ఐశ్వర్యమునకు తగినట్లు కూతురు అత్తవారింటికి వెడుతోందని ఎన్నో కానుకలను ఇచ్చాడు. ఎన్నో పట్టు చీరలను, ఎన్నో బంగారు నగలను, అనేక మత్తగజములను, అనేక అశ్వములను, అనేక పల్లకీలను, అనేక భూములను, పురములను, పుష్పములను, సారెగా ఇచ్చి పంపాడు.
పార్వతీ పరమేశ్వరులిద్దరూ నందివాహనం ఎక్కి కైలాసమునకు బయలుదేరారు. వెనక సరస్వతీ దేవి, చతుర్ముఖ బ్రహ్మ, వారి వెనుక లక్ష్మీ నారాయణులు, శచీదేవి, ఇంద్రుడు బయలుదేరారు. ఇంతమంది దేవతలు కైలాసమును చేరుకున్నారు. పార్వతీ దేవి వచ్చింది ఇప్పుడు కైలాసంలో నిత్యోత్సవములు ప్రారంభం అయ్యాయి. దేవతలు అందరూ శంకరుని వద్దనుండి కానుకలు, తాంబూలములు పుచ్చుకుని స్వస్థానములకు వెళ్ళిపోయారు.
పార్వతీ పరమేశ్వరులిద్దరూ కైలాస పర్వతం మీద కూర్చుని అక్కడి నుండి ఎప్పుడూ తమను నమ్మినవారిని, కొలిచిన వారిని, తమకు నమస్కరించినవారిని అలా చూస్తూ, కాపాడుతూ, జగత్తుకి తల్లిదండ్రులై విరాజిల్లుతున్నారు. శంకరభగవత్పాదులు
కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే
శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్సురదనుభవాభ్యాం నతిరియమ్!!
అంటారు.
కోరి కొలిచిన వాళ్ళకి ఇక్కడే ఉండి రక్షించే ఆ మాతాపితరులు లోకములను చల్లగా చూస్తున్నారు.
ఈ పార్వతీ కళ్యాణ ఘట్టమును, ఈ శివమహాపురాణ ప్రవచనమును విన్నవారికి, చదివిన వారికి, సర్వ కాలములయందు పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది.
సర్వం శ్రీ ఉమా మహేశ్వర పదబ్రహ్మార్పణమస్తు!!